గూగుల్ సరికొత్త ఆవిష్కరణ... స్క్రీన్ లేకుండానే ఫిట్‌నెస్ ట్రాకర్లు!

  • గూగుల్ నుంచి కొత్తగా 'ఫిట్‌బిట్ ఎయిర్' విడుదల
  • స్క్రీన్ లేకుండా నిరంతరం ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే డివైజ్
  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు పనిచేసే బ్యాటరీ
  • జెమినీ ఏఐ పవర్డ్ హెల్త్ కోచ్‌తో వ్యక్తిగత సూచనలు
  • త్వరలోనే భారత్‌లో విడుదల, రూ.12,000 నుంచి ధర అంచనా
టెక్ దిగ్గజం గూగుల్, ఫిట్‌నెస్ టెక్నాలజీలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. స్మార్ట్‌వాచ్‌ల తరహాలో స్క్రీన్, నోటిఫికేషన్ల ఆర్భాటం లేకుండా కేవలం ఆరోగ్యంపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించేలా 'గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్' అనే సరికొత్త ట్రాకర్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. నిరంతరం ధరించేందుకు వీలుగా దీనిని డిజైన్ చేశారు.

ఈ ఫిట్‌బిట్ ఎయిర్ అత్యంత తేలికగా ఉండటం దీని ప్రధాన ఆకర్షణ. స్ట్రాప్‌తో కలిపి కేవలం 12 గ్రాముల బరువుండే ఈ డివైజ్, 24 గంటలూ చేతికి ఉన్నా అసౌకర్యంగా అనిపించదు. వాటర్‌ప్రూఫ్ కావడంతో స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా దీనిని తీయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే వారం రోజుల పాటు (7 రోజులు) నిరంతరాయంగా పనిచేస్తుంది. కేవలం 5 నిమిషాల క్విక్ ఛార్జ్‌తో ఒక రోజంతా వినియోగించుకోవచ్చు.

ఫిట్‌బిట్ ఎయిర్ నిరంతరం హార్ట్ రేట్, రక్తంలో ఆక్సిజన్ స్థాయులు (ఎస్పీఓ2), నిద్ర నాణ్యతను పర్యవేక్షిస్తుంది. ఇందులో ఉన్న 'స్మార్ట్ వేక్' ఫీచర్, యూజర్ గాఢ నిద్రలో లేనప్పుడు సున్నితమైన వైబ్రేషన్‌తో నిద్రలేపుతుంది. వర్కౌట్లను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ఇక గూగుల్ హెల్త్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి, జెమినీ ఏఐ ఆధారిత 'హెల్త్ కోచ్' ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఇది వ్యక్తిగత వర్కౌట్ ప్లాన్‌లు, ఆరోగ్య సూచనలు అందిస్తుంది.

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో దీని ధర 99.99 డాలర్లుగా (సుమారు రూ.8,300) ఉంది. ఇప్పటికే ఈ డివైజ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికేషన్ పొందినట్లు వార్తలు వస్తుండటంతో, త్వరలోనే భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. మన దేశంలో దీని ధర రూ.12,000 నుంచి రూ.14,000 మధ్య ఉండవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Google Fitbit Air
Fitness Tracker
Google Gemini AI
Wearable Technology
Health Monitor
Smart Wake Feature

More Telugu News